నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Wednesday, October 29, 2008

అప్పా రావు కాలనీ - ౩ - నంది పాడ్యమి

మన బబ్లూ గాడు గుర్తున్నాడా? (లేక పోతే ఇంతకు ముందు కథలు చదవండి)
వాడు వినాయక చవితి అయినప్పటి నుంచీ ఆలోచిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు గా వినాయక చవితి జరుపుకుంటున్నారు కదా, అది ఎవరు మొదలుపెట్టారా అని! వాళ్ల బామ్మ ని అడిగాడు, ఆవిడ శివుడు మొదలు పెట్టాడు అంది. నాన్నని అడిగాడు, ఆయన ఋషులు మొదలెట్టారు అని చెప్పారు. వీళ్ళలో ఎవరు కరెక్ట్ అని అమ్మని అడిగితే "నన్ను ఇన్వాల్వు చెయ్యకండి రావు గారూ' అంది ఆవిడ.
ఫైనల్ గా వాడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరికీ తెలియదు అని.
ఐతే వాడికి ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఒక పండగ కనిపెట్టి దానిని బాగా జరిపితే పాపులర్ అయిపోతాము కదా అని! ముఖ్యం గా కొన్నాళ్ళు స్కూల్ కి వెళ్ళక్కర్లేదు కదా!

వచ్చే ఉదయం అమ్మని, నాన్నని లేపి చెప్పాడు, "నాన్నగారు, నాకు నిన్న రాత్రి నిద్రలో నంది వచ్చింది. అది చాలా బాధ పడింది. ఇన్ని యుగాల నుంచి శివుడిని లోకాలన్నీ తిప్పుతున్నాను కదా, నాకు ఒక్క పండగ కూడా లేదా అని కంట తడి పెట్టుకుంది" అని చెప్పాడు! బామ్మ పరిగెత్తుకొచ్చి వాళ్ల నాన్నతో అంది 'ఒరేయ్ నానీ, నేను చెప్పాను కదా, చిన్నప్పుడు వీడు పుట్టిన నక్షత్రం ఎంతో దివ్యమైనది అని! చూశావా, వీడికి నంది కలలోకి వచ్చిందట!! తరచూ మీ నాన్నగారికి కూడా నంది కలలోకి వచ్చేది రాఆఆఆ!" అని బబ్లూ గాడి ప్లాన్ ని పాస్ చేసేసింది!

సాయంత్రం ఇదు సరికీ పిల్లలందరూ కలిసి చందా డబ్బాలు పట్టుకుని బయలుదేరారు కాలనీ లో, వానర సేన లంక మీద పడ్డట్టు. ఒక్కొక్క ఇంటి వాళ్ళకీ టెన్షన్! ఇప్పుడే కదా దసరా అయ్యింది, చందాల వాళ్లు ఏమైనా వదిలితే దీపావళి కి కల్చేసామాయే, ఇప్పుడు ఈ కొత్త కల్లెక్షన్ ఏంటి రా భగవంతుడా అని!
బబ్లూ గాడి వెనక పిల్లలు ఒక ఇరవై మంది బయలుదేరారు, మన కాలనీ లో ప్రపంచం లోనే మొదటి సారి గా నంది పాడ్యమి జరుపుకుంటున్నాము, మీ వొంతు చందా ఇవ్వండి అని! ఒక్కొక్కళ్ళ మొహాలూ చూడాలి! నంది పాడ్యమి ఏమిటి, చందా ఏమిటి! పిల్లలు ఇలా రామ దండు లాగా బయలుదేరడమేమిటి!
ఎలాగా ఐతే ఏమి, పిల్లల తండ్రులు అందరూ తలో చెయ్యి వేసారు.
ఇప్పుడు
వచ్చింది చిక్కు. గణపతి, దుర్గ బొమ్మలు చేసిన మార్వాడి వాడు "నాకు నంది బొమ్మ రాదు" అన్నాడు హిందీలో! పాత చందనా బ్రదర్స్ క్యాలెండర్ పట్టుకొచ్చాడు కిట్టు గాడు. అందులో నవ్వుతున్న నందిని చూపించి, "ఇదిగో, ఇప్పుడు చెయ్యి" అన్నాడు!
ఒక
వారం అయ్యాక, అమావాస్య రోజు 'ఒక రకం గా చూస్తున్న' నంది (లాంటి) బొమ్మని పిల్లలందరూ చిన్నా రావు ఆటో లో తెచ్చారు. దానికి కూడా కళ్ళకి గుడ్డ కట్టి! మరి పూజ కి ముందు తీయకూడదు కదా!
సుబ్రహ్మణ్యం గారి (చిరుత) కార్ కవర్ తీసుకొచ్చి ఒక టెంట్ లాగ చేసి, దాంట్లో ప్రతిష్ట చేసారు.

ఐతే, అయ్యప్ప కోవెల లో కేరళా పంతులు గారికి నంది పూజ రాదుట! బామ్మ అతన్ని భీబత్సమైన తిట్లు తిట్టింది! ఆయన కూడా ఏవో మలయాళం లో అన్నాడు, పాపం పారిపోయాడు!
కిట్టు గాడు చాలా సరైన వాడు. సరిగ్గా మళయాళ మాంత్రికుడు పారిపోయే సమయానికి చెప్పాడు - బామ్మగారూ, మా బాబాయి చిన్నప్పుడు ఉన్న వేదాలన్నీ భయంకరం గా నేర్చుకున్నాడు అని అందించాడు. అంతే! వామ్మో వారి నాయనో అని విలపిస్తున్నా వినకుండా బామ్మ గారి ఆజమాయిషీ లో పిల్లలు అందరు కలిసి కిట్టు గాడి బాబాయి ని ఎత్తుకోచ్చారు! "ఎలాగో ఉద్యోగం లేదు కదా రా, నంది పూజ చేస్తే బిల్ గేట్స్ ఉద్యోగం వస్తుంది అని కేనోపనిషద్ లో ఉంది" అందావిడ. మరేమి మాట్లాడతాడు? కష్టపడి పంచ కట్టుకుని, (అది జారిపోకుండా లోపల బెల్ట్ పెట్టుకుని) నామాలు పెట్టుకు వచ్చేడు.

ఒహొ! ఏమి పూజలనుకున్నారూ? బాబాయి మంత్రాలు గబ గబా చదివేస్తున్నాడు (మరి .....) నంది పాడ్యమి అన్నా విషయం తెలిసే సరికి పక్కన ఉన్న కాలనీ వాళ్ళూ, చుట్టాలూ అందరూ వచ్చేసారు ! హుండీ నిండింది!

మరసటి రోజు నిమజ్జనానికి మళ్ళీ చిన్నా రావు ఆటో, బాబాయి మంత్రాలు (ఇప్పుడు కొంచం గట్టిగా చదివేడు లెండి - అలవాటు అయ్యింది కదా!), వెనకాల బబ్లూ గాడు 'మాయదారి మైసమ్మ' పాటలు, డాన్సులు, భలే అయ్యింది లెండి!

సంవత్సరం తిరిగింది. బాబాయి కి నిజం గా అమెరికా లో ఉద్యోగం వచ్చింది, బబ్లూ గాడు అన్ని సబ్జేక్టులలో భలే గా పాస్ అయ్యాడు. కాలనీ కి మంచి నీటి పంప్ ఇంకొకటి బిగించారు, రోడ్లు మరమ్మతు చేశారు.
అంతా నంది పాడ్యమి మహిమ అని ఈ సారి బబ్లూ గాడు చందా డబ్బా తియ్యకుండానే అందరూ ముందుకొచ్చారు!

ఈ సారి మార్వాడి వాడి బొమ్మలో నంది నవ్వింది.