మనం మామూలుగా 'సక్సెస్ స్టోరీస్' అంటే ఏ బిల్ గేట్స్ నో లేక ఏ ప్రేమ్జీ నో చూస్తూ ఉంటాము.నిజమే, వాళ్ళ జీవితం ఆదర్శప్రాయం.
ఐతే నాకు మొన్న ఒక సాధారణ మనిషి కథ ఎంతో బాగా అనిపించింది.
ఆయన పేరు రాములు. ఊరు శ్రీకాకుళం అవతల ఏదో చిన్న పల్లెటూరు.
నాలుగో క్లాస్ దాకా చదివిన ఆయినా ఆ తరువాత పొలాల్లో పనికి వెళ్ళడం మొదలు పెట్టారు.
ఐతే వర్షం పడక ఉన్న రెండెకరాల భూమి అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
పెద్దగా డబ్బులు ఏమి రాలేదు, కానీ తప్పదు. తినాలి కదా అన్నారాయన, మొన్న నా తో మాట్లాడుతూ.
ఈ లోపు జబ్బు చేసి తల్లి పోయింది. తండ్రికి పని లేక తాగుబోతు అయ్యాడు. ఇంకొన్నాళ్ళకి ఆయన కూడా పోయాడు.
ఇద్దరు చెల్లెళ్ళు. కష్టపడి ఒక దానికి తండ్రి ఉండంగానే పెళ్లి చేసారు. రెండో చెల్లిని తీసుకొని రాములు వైజాగ్ వచ్చేడు.
ఇక్కడ ఒక రైల్వే కాంట్రాక్టర్ దగ్గర కలాసి గా చేరాడు. ఆ డబ్బుల తోటే చిన్న చెల్లి కి పెళ్లి కూడా చేసాడు.
కాంట్రాక్టర్ మంచాయనట . ఆ సంవత్సరం రైల్వేస్ లో గ్యాంగ్ మాన్ పోస్టులు పడితే దానికి రాములు ని అప్లై చెయ్యమని చెప్పి, ఎవరో ఫై అధికారులకు కూడా సిఫార్సు చేసాడు.
దానితో రాములు రైల్వేస్ లో పెర్మనెంట్ అయ్యాడు.
రైల్వేస్ లో ఉద్యోగం రాంగానే ఊరి నుంచి సంబంధాలు వచ్చేయి! దూరపు చుట్టాలైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఒక చిన్న ఇళ్లు కూడా కట్టుకున్నాడు.
రాములు మాటలలో ఒక గర్వం ఉంది. దానికి కారణం ఇన్ని సంవత్సరాలలో ఆయన ఒక్క సిగరెట్ గాని చుక్క మందు కాని ముట్టుకోకపోవడమే! తండ్రి తాగుబోతు అవ్వడం తో వచ్చిన కష్టాలు ఆయన మరచిపోలేదు!
రాములు కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. ఆయన గర్వం గా ఇంకో విషయం చెప్పాడు. కూతురు పుట్టంగానే ఆయన వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు! నాకు ఈ విషయం విని భలే ఆనందం వేసింది!
పిల్లలతో బాటు రాములు, ఆయన భార్య కూడా మెట్రిక్ కట్టి పాస్ అయ్యారు!
పిల్లలు పెద్ద వాళ్ళ అయ్యారు, రాములు కూడా డబ్బు దాచుకున్నాడు.
వాళ్ల ఇంటి పక్కనే ఇంకో రెండు ఇళ్లు కూడా కట్టి అద్దెకు ఇచ్చేడు.
పెద్ద వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, అమ్మాయికి కంప్యూటర్స్ నేర్పించేరు.
ఇవాళ కొడుకూ, కూతురూ ఇద్దరూ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగం లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయికి పెళ్లి అయిపొయింది, ఆల్ హ్యాపీస్.
మొన్న కొత్తగా మన రైల్వే స్టేషన్ లో ac వెయిటింగ్ హాల్ ఒకటి ప్రారంభించారు. దానికి ఇన్ఛార్జ్ గా రాములు ని పెట్టారు. 25 సంవత్సరాల తరువాత రాములు కి దక్కిన రికగ్నిషన్ ఇది. గత వారం హైదరాబాద్ వెల్తునప్పుడు కొంచం సేపు అక్కడ వెయిట్ చేసాము. అప్పుడు రాములు పరిచయం అయి చెప్పిన కథ ఇది. ఆయన మాటలలో వింటే ఇంకా బాగుంటుంది!
ఎక్కడో ఎండలలో కూలి పని చేసుకునే నాకు రోజంతా ac గది లో కూర్చునే ఉద్యోగం చూపించిన దేముడికి పెద్ద థాంక్స్! అన్నాడు అతను.
అప్పుడు అనిపించింది - ఇది మంచి 'సక్సెస్ స్టొరీ' కాదా?? అని.

1 comment:
chala bavundi.....ivala dainandina jeevitham lo rojuki 20 gantalu kastapaduthoo paiki vastunna chalamandi ae maharshi kante thakkuva kaadu ( yandamoori quote ...)
Post a Comment